హైదరాబాద్: రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. ద్రోణి అనిశ్చితి పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Also Read: మీకు పెరిగిన DA ఎంతో ఇక్కడ తెలుసుకోండి
తెలంగాణ: మరో రెండు రోజులు వడగళ్ల వానలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు పడే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ పది జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని వివరించింది. తగ్గిన ఉష్ణోగ్రతలు వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతుందని వెల్లడించారు. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాచలంలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 18.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సగటు వర్షపాతం 2.97 సెం.మీ సోమవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.97 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జనగామ జిల్లాలో 6.47, హనుమకొండ జిల్లాలో 5.76, వరంగల్ జిల్లాలో 5.08, కరీంనగర్ జిల్లాలో 4.42, మంచిర్యాల జిల్లాలో 4.0, జగిత్యాల జిల్లాలో 4.0 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.